జస్ట్ మీ ఫోన్ నంబర్ ఉంటే చాలు..
ప్రజాహితమనే ముసుగుతోనే ఇప్పటికే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు తమ దేశ పౌరుల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టిన అంశాన్ని బహిర్గతం చేయడం ద్వారా విజిల్ బ్లోయర్ ఎడ్వర్ స్నోడన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్ జరిగే అవకాశమున్నా వినియోగదారులు ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి పెద్దగా రక్షణ చర్యలు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉన్నా.. నెట్‌వర్క్ వైపు నుంచి హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే అవకాశముంది. 1975లో అభివృద్ధి చేసిన ప్రోటోకాల్ సిగ్నలింగ్ సిస్టమ్ నంబర్ 7 (ఎస్‌ఎస్7) ఈ విషయంలో హ్యాకర్లకు సహాయపడుతోంది. దీనితో సులువుగా రాబట్టే అంశాలైన ఫోన్ నంబర్‌తో కూడా హ్యాకింగ్‌కు పాల్పడి.. కాల్స్, లోకేషన్లు, మెసేజ్‌లు వంటి సమాచారాన్ని సంగ్రహించవచ్చు.
ఈ ఎస్‌ఎస్7 పద్ధతి ద్వారానే బ్రిటన్ పెద్ద ఎత్తున తమ పౌరుల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టిందనే అంశం వెలుగులోకి వచ్చింది. 2015లో జరిగిన ఓ హ్యాకర్ల కాన్ఫరెన్స్‌లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తోందో తొలిసారిగా వెల్లడించాయి. అయినప్పటికీ ఈ విధానం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది.
ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెలిగ్రామ్, వాట్సాప్, ఐ మెసేజ్‌స్, ఫేస్‌టైమ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించడం ఉత్తమమని, వీటి ద్వారా మీ కమ్యూనికేషన్స్ ప్రైవేటుగా ఉండే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనివల్ల ఓ ముప్పు లేకపోలేదు. ఈ యాప్‌ల వల్ల ఉగ్రవాదులు సోషల్ మీడియాలో జరిపే కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉండదని భద్రతా వర్గాలు అంటున్నాయి. తాజాగా ఓ ఉగ్రవాది ఐఫోన్ అన్‌లాక్ వివాదంపై ఎఫ్‌బీఐ, యాపిల్ కంపెనీ ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. దీంతో పౌరుల ప్రైవసీ అంశంపై ఎడతెగని చర్చ కొనసాగుతూనే ఉంది.
No comments:
Post a Comment