Friday, 22 April 2016

దేశంలో రోబో కార్మికులు


వెల్డింగ్‌ చేయడం ప్రమాదంతో కూడుకున్నదని, గ్యాస్‌ వాసన భరించలేకపోతున్నామంటుంటారు సంబంధిత కార్మికులు. కంట్లో నిప్పురవ్వలు పడతాయన్న భయమూ ఉంటుంది. మార్కెట్‌లో వెల్డింగ్‌ పనులు చేసే సుశిక్షుతులైన మానవ వనరులు అందుబాటులో లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభించనుంది. చిన్నచిన్న వెల్డింగ్‌ పనుల్ని రోబోలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఆటోమేషన్‌ త్వరలో మన దేశంలోనూ విస్తరించనుంది.

రోబోల తయారీ అంటే ఇప్పటి వరకు జపాన్‌, చైనా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని సంస్థలదే పైచేయిగా ఉంది. ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన రోబోలు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌ వాటాను ఆక్రమించాయి. భారత్‌లో కొన్ని రోబో తయారీ సంస్థలున్నా, అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన సంస్థల భాగస్వామ్యంలో ఏర్పాటు చేసినవే. తాజాగా రోబోలకు భారత మార్కెట్‌లో విస్తృత డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇక్కడి అవసరాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రోబోలను తయారు చేసేందుకు పలు అంకుర సంస్థలు(స్టార్టప్‌) ముందుకు వస్తున్నాయి. రోబోల తయారీ రంగంలో పెట్టుబడులకు భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో తయారీ(మేక్‌ ఇన్‌ ఇండియా)కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున దేశీయంగా తయారు చేసే రోబోలకు ప్రాముఖ్యం ఉండనుంది. ఈ క్రమంలో దేశీయ తయారీ రోబోలకు అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ ఉండనుంది. అయినప్పటికీ విదేశీ సంస్థల నుంచి పోటీని తట్టుకుని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తరువాతే రోబోల్ని దేశీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని అంకుర సంస్థలు ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక అవసరాల కోసం చిన్న రోబోలు మార్కెట్‌లోకి రానున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలు తీర్చేలా ఈ రోబోలు ఉండనున్నాయి. ఇప్పటికే వెల్డింగ్‌, బరువులు ఎత్తడం, చిన్న పరిశ్రమల్లో పనులు చేయడం తదితర అవసరాల కోసం నమూనాలు సిద్ధమవుతున్నాయి. ఆటోమేటెడ్‌ పనుల కోసం దేశీయంగా ప్రతిఏటా కనీసం 1,000 భారీ రోబోలు అవసరం. అంతర్జాతీయంగా ఈ డిమాండ్‌ 5వేల వరకు ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఐదేళ్లలో ఈ డిమాండ్‌ పదింతలు కానుంది.   ప్రస్తుతం టాటా సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన రోబోలను బ్రాబో పేరిట ఉత్పత్తి చేయనుంది. దేశీయ అవసరాల కోసం ఆటోమేషన్‌లో భాగంగా త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇటీవల ముంబయిలో భారీ ఎత్తున జరిగిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో టాటా తన ‘బ్రాబో’ను ప్రదర్శనకు ఉంచింది. ఒక్కో రోబో ఖరీదు రూ.3 లక్షలుగా ఉంది. ఇది 2 కిలోల బరువు పనులు చేస్తుంది. రూ.6 లక్షల ఖరీదైన మరో రోబో కనీసం 10 కిలోల బరువున్న పనులు చేస్తుంది.

No comments:

Post a Comment